Tuesday, 04 August 2026 06:27:50 AM

భీమిలిలో అట్టహాసంగా శ్రీ కుంచమాంబ జాతర

Date : 08 July 2026 06:42 AM Views : 88

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : భీమిలి కీటిన్‌పేట, బ్యాంకు కాలనీతో పాటు పరిసర గ్రామాల గ్రామదేవత శ్రీ కుంచమాంబ అమ్మవారి జాతర మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. సోమవారం నిర్వహించిన తొలేళ్ల ఉత్సవం సందర్భంగా అద్భుతమైన బళ్ల వేషాలు, కాంతార నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వివిధ కళారూపాలతో కూడిన భారీ ఊరేగింపు స్థానికులను, భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. రాత్రి నిర్వహించిన బాణసంచా ప్రదర్శనతో జాతర ఉత్సాహం మరింత రెట్టింపైంది. మంగళవారం జరిగిన అమ్మవారి అనుపు ఉత్సవానికి ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పసుపు, కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం పులివేషాలు, కోలాటాలు, విచిత్ర వేషధారణలు, డప్పులు, సాముగరిడి వంటి సంప్రదాయ గ్రామీణ కళారూపాలతో జరిగిన శోభాయాత్ర జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాతర మార్గమంతా భక్తుల రద్దీ, కళాకారుల విన్యాసాలు, ఆధ్యాత్మిక వాతావరణంతో సందడిగా కనిపించింది. జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తాగునీరు, క్యూలైన్లు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయగా, భద్రతా పరంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు. ఉత్సవాలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగియడంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :