Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : సెప్టెంబర్ 23: ఇటీవల భారీ ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా ప్రభావితమైన నేపాల్‌కు సహాయం అందించేందుకు భారతదేశానికి చెందిన హెల్ప్ ఎయిడ్ సంస్థ ముందుకొచ్చింది. విపత్తుల ముందస్తు అంచనా, హెచ్చరికల జారీ కోసం ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించేందుకు ఉపయోగపడే సూపర్ కంప్యూటర్‌ను నేపాల్ ప్రభుత్వానికి అందించింది. ఈ సూపర్ కంప్యూటర్‌ను అందించేందుకు అవసరమైన నిధుల సేకరణలో కేథరిన్ విద్యా సంస్థలు కీలకంగా వ్యవహరించాయి. సంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సహాయక సిబ్బంది కలిసి విరాళాల రూపంలో రూ.1.40 లక్షలు సేకరించారు. దీనికి యాజమాన్యం మరో రూ.1.60 లక్షలు జోడించి మొత్తం రూ.3 లక్షలను హెల్ప్ ఎయిడ్ సంస్థకు అందించింది.
కేథరిన్ విద్యా సంస్థల అధిపతి శ్రీ ఆలివర్ రాయీ నేతృత్వంలోని హెల్ప్ ఎయిడ్ బృందం ఈ నిధులతో సూపర్ కంప్యూటర్‌ను సమకూర్చి నేపాల్ ప్రభుత్వానికి అందించింది. భారీ వర్షాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులను ముందుగానే అంచనా వేసి హెచ్చరికలు జారీ చేయడంలో ఈ సాంకేతిక వ్యవస్థ ఉపయోగపడనుంది. తద్వారా ప్రమాద ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.
నేపాల్ ప్రభుత్వ NDRRA అధికారులు మహేష్ చంద్ర నేపాల్, జాయింట్ సెక్రటరీ; రామ్ బహదూర్ కె.సి., అండర్ సెక్రటరీ; రాజేంద్ర శర్మ, అండర్ సెక్రటరీ; జియాలజిస్ట్ ప్రకాష్ పోఖ్రెల్, ఇంజనీర్ జగదీష్ బిస్తా తదితరులు హెల్ప్ ఎయిడ్ నుంచి సూపర్ కంప్యూటర్‌ను స్వీకరించారు. ఈ సందర్భంగా హెల్ప్ ఎయిడ్‌కు చెందిన శ్రీ ఆలివర్ రాయీ మాట్లాడుతూ.. చిన్నచిన్న విరాళాలుగా అందించిన ప్రతి రూపాయి భవిష్యత్తులో వేలాది ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించగలదని అన్నారు. నేపాల్ అధికారులు, స్థానికులతో చర్చించి అక్కడి అవసరాలను అంచనా వేసిన అనంతరం సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ గుణకర్ భట్టతో జరిగిన చర్చల అనంతరం, హెల్ప్ ఎయిడ్ బృందం తమ రెండో సహాయక మిషన్‌లో భాగంగా సుమారు రూ.40 లక్షల విలువైన వైద్య పరికరాలను నేపాల్‌కు తీసుకురానున్నట్లు హామీ ఇచ్చింది. ప్రకృతి విపత్తుల సమయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం ద్వారా ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ఈ సూపర్ కంప్యూటర్ దోహదపడుతుందని హెల్ప్ ఎయిడ్ ప్రతినిధులు తెలిపారు.
Admin
Neti Sakshyam